టీ20 ప్రపంచకప్ ను గ్రాండ్ గా ప్రారంభించింది భారత మహిళా జట్టు. సిడ్నీ వేదికగా తన మొదటి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే క్రితం విజేత, ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆసీస్ ను భారత్ అన్ని విభాగాల్లో కట్టడి చేసి ఆత్మస్థైర్యంతో ప్రపంచకప్ లో ముందడుగు వేసింది.
తిప్పేసిన పూనమ్
భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ బౌలింగ్ లో సత్తా చాటి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసుకొని విజయంలో కీలకపాత్ర పోషించింది. హ్యాట్రిక్ ను తృటిలో కోల్పోయిన పూనమ్ మ్యాచ్ ఆధ్యాంతం కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకుంది. 12వ ఓవర్ 3వ బంతికి వికెట్ తీసిన పూనమ్ 4వ బంతికి బలమైన పెర్రీ వికెట్ ను బౌల్డ్ ద్వారా దక్కించుకుంది. ఆయింట్ 5వ బంతికి కూడా వికెట్ దక్కేదే. కీపర్ క్యాచ్ ను అందుకోవడంలో విఫలం అవడంతో పూనమ్ యాదవ్ హ్యాట్రిక్ కోల్పోవాల్సివచ్చింది.
పూనమ్ కు తోడు శిఖా పాండే 3 వికెట్లు తీసి విజయంలో తన వంతు భూమిక పోషించింది. చివరకు 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా.
రాణించిన దీప్తి శర్మ
అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి వికెట్ కు షఫాలీ వర్మ (29, 15 బంతుల్లో 5×4, 1×6) మరియు స్మృతి మందన 4 ఓవర్లలో 40 పరుగులు చేశారు. వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయినా దీప్తి శర్మ మరియు జెమిమా రోడ్రిగ్జ్ లు 4వ వికెట్ కు 53 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
దీప్తి 49* (46 బంతుల్లో 3×4) పరుగులతో వేద కృష్ణమూర్తి 9* పరుగులతో నాటౌట్ గా నిలిచారు. జెమిమా 26 పరుగులు చేసింది.
పూనమ్ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోర్లు: భారత్ 20 ఓవర్లలో 132/4 (దీప్తి శర్మ 49 *, షఫాలి వర్మ 29; జెస్ జోనాస్సేన్ 2-24)
19.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 115 పరుగులు (అలిస్సా హీలీ 51, ఆష్లీ గార్డనర్ 34; పూనమ్ యాదవ్ 4-24, శిఖా పాండే 3-14)
ఫలితం: భారత్ 17 పరుగుల తేడాతో విజయం.
భారత్ తదుపరి మ్యాచ్: 24 ఫిబ్రవరి 2020 న బంగ్లాదేశ్, వేదిక: పెర్త్