TS Inter Result Date 2020. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ వ్యాల్యుయేషన్ మరియు పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో మంత్రి గారు సమీక్ష నిర్వహించారు.
TS Inter Result Date 2020
సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ జవాబు పత్రాల కోడింగ్ ఈరోజు (గురువారం, 07 మే 2020) మొదలైందని, మే 12వ తేదీ నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఇందుకుగాను గతంలో 12 సెంటర్లు ఉపయోగించగా ఇప్పుడు 33 సెంటర్లకు పెంచుతున్నట్లు తెలిపారు. మే 30వ తేది వరకు పేపర్లు దిద్దడం పూర్తి కానుంది.
వాల్యుయేషన్ ప్రక్రియకు హాజరయ్యే లెక్చరర్స్‌కు అన్ని రకాల వసతులతో పాటు, రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. దాదాపు 9 లక్షల 50 వేల మంది పిల్లలు ఇంటర్ పరీక్షలు రాశారు. 53 లక్షల 991 ఆన్సర్ పేపర్లు ఉంటాయి. అలాగే ఇంటర్ మోడ్రన్ లాంగ్వేజ్స్, జాగ్రఫీ పరీక్షలు ఈ నెల 18 (మే 18, 2020)న నిర్వహిస్తుంది ఇంటర్ బోర్డు.
అదే విధంగా పదవ తరగతి పరీక్షలు కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తే మే నెలలోనే పూర్తి చేయనున్నట్లు, ఇందుకు సానుకూలంగా ఉన్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కోరారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయడమే కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.