అమూల్య లియోనా అరెస్ట్, 14 రోజుల రిమాండ్, ఏం చేసినా తప్పులేదన్న కన్న తండ్రి

అమూల్య లియోనా అరెస్ట్

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమ సభలో ‘పాకిస్తాన్ —ద్’ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒవైసి సభ దిగుతుండగా ఆ అమ్మాయి మాటలు విని షాక్ అయిన ఒవైసీ ఆమె వైపు పరుగెత్తి ఆమె నుండి మైక్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పోలీసులు, వేదిక మీద ఉన్న కొందరు ఆమెను కిందకు దించారు. దిగ్భ్రాంతికి గురైన హైదరాబాద్ ఎంపి, నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశాడు.

అమూల్య లియోనాకు మాకు సంబంధం లేదు – ఒవైసీ

పీటిఐ తో ఇలా చెప్పారు ఒవైసీ “ఆమెతో నాకు గాని నా పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదు. నిర్వాహకులు ఆమెను అలా ఎలా ఆహ్వానించారో తెలియదు. ఇది నాకు తెలిస్తే, నేను ఇక్కడకు వచ్చేవాన్ని కాదు. భారతదేశం నా దేశం మన శత్రు దేశం పాకిస్తాన్ కు ఏ విధంగానూ మద్దతు ఇవ్వము. మేము చేసే పోరు CAA కి వ్యతిరేకంగా భారతదేశాన్ని రక్షించడం.”

ఎవరు అమూల్య

కొంతమంది నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, అముల్య వయస్సు 19 సంవత్సరాలు, బెంగళూరులోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతుంది. అలాగే ఆమె నగరంలోని ఒక అనువాద సంస్థలో ఇంటర్న్‌గా కూడా పనిచేస్తుంది.

ఆమెకు విప్లవాత్మక ఆలోచనలు ఉన్నాయని మరియు తను సాధారణంగా ఎవరి మాట వినదు అని సన్నిహితులు చెప్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ లో కూడా కొన్ని తిక్క పోస్టులు పెట్టడమే కాకుండా ఇలాంటి నినాదాలు చేయడంలో తప్పు లేదని తన వైఖరిని తెలిపింది.

తీవ్రంగా స్పందించిన అమూల్య తండ్రి

బెంగళూరు నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్మగళూరు జిల్లాలోని కొప్పాలో నివసిస్తున్న అమూల్య తండ్రి వోజాల్డ్ తన కుమార్తె ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

కలత చెందిన తన తండ్రి ఆగ్రహం వెళ్లగక్కాడు, ‘నా కుమార్తెను జైలులో పెట్టండి. పోలీసులు ఆమె కాళ్ళు ఎక్కడిక్కడ విరగొట్టండి. నాకు ఏలాంటి అభ్యంతరం లేదు. ఆమె వల్ల నా కుటుంబానికి చాలా కష్టాలు వస్తున్నాయి, ఆమె కోసం ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేయను’ అని చెప్పుకొచ్చారు వోజాల్డ్.

అమూల్య ఇంటిపై దాడి

ఈ సంఘటన జరిగిన వెంటనే, కొంతమంది స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమె తండ్రిని కలవడానికి వెళ్ళారు. వారు అతనితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి అముల్య ఇంటిపై దాడి చేశారు, విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె తల్లిదండ్రులకు భద్రత కల్పించారు. ఈ సంఘటన మీద ఆమె తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమూల్య లియోనా అరెస్ట్ – పలు సెక్షన్లు నమోదు

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ఎ (దేశద్రోహ నేరం) కింద కర్ణాటక పోలీసులు అముల్యపై కేసు నమోదు చేశారు. అంతే కాకుండా 153A మరియు B (వేర్వేరు గ్రూపుల మధ్య వైరాన్ని ప్రోత్సహించడం). జాతీయ సమైక్యతకు భంగం కలిగించడం.

శుక్రవారం పోలీసులు ఆమెను విచారిస్తారు, అనంతరం ఆమెను కోర్టుకు హాజరుపరుస్తారు.