హైదరాబాద్ టోలిచౌకిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కేసీఆర్‌ మార్గ మధ్యంలో ఒక వికలాంగ వృద్ధుడి చేతిలో విన్నప పత్రం పట్టుకొని ఎదురుచూస్తున్న అతన్ని చూసి వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరికి వెళ్ళాడు.

ఓపికగా తనకున్న సమస్యలు విన్న సీఎం వెంటనే స్పందించడమే కాకుండా అతని సమస్యను  పరిష్కరించి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన పేరు సలీమ్‌ అని పరిచయం చేసుకున్న ఆ వృద్దుడు సమస్యలు చెప్పుకున్నాడు. గతంలో డ్రైవర్ గా పనిచేసేవాడినని, గత తొమ్మిది సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాని, తన కుమారుడి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందని, 4 సంవత్సరాల క్రితం బిల్డింగ్ పై నుండి పడి నా కాలు విరిగింది, ఇల్లు కూడా లేని దుస్థితిలో ఉన్నానని తన బాధ వివరించారు.

అంతా ఓపికగా విన్న కేసీఆర్‌ అతని సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతిని ఆదేశించారు. వికలాంగుల పెన్షన్ తో పాటుగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు.

స్పందించిన కలెక్టర్ టోలిచౌకిలోని సలీం ఇంటికి వెళ్లి విచారణ చేసి వివరాలు సేకరించారు. సలీం వికలాంగుడని ధృవీకరించే సదరం సర్టిఫికెట్‌ ఉండడంతో ఫిబ్రవరి నే పింఛన్ రూ.3016 వెంటనే అందచేశారు. అలాగే జియాగూడలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లును మంజూరు కూడా చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ పథకం కింద ఆరోగ్యం బాగాలేని తన కుమారుడికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీనిచ్చారు.

తమ సమస్యలను ఓపికగా విని పరిష్కరించినందుకు సలీం కుటుంబసభ్యులు సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.