గాయని కనికా కపూర్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లండన్ నుండి వచ్చిన తరువాత ఏమాత్రం బాధ్యత లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఇచ్చిన పార్టీకి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరియు ఆమె తనయుడు బిజెపి ఎంపీ దుశ్వంత్ సింగ్ లు ఈ పార్టీకి హాజరయిన వారిలో ఉన్నారు.
FIR Booked Against Kanika Kapoor
మార్చి 14న లండన్ నుండి వచ్చిన కనికా కపూర్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని, స్వీయ నిర్భంధంలో ఉండాలని సూచించినప్పటికీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడంతో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్లు 188, 269, మరియు 270 కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అయితే తాను మాత్రం మార్చి 9న ముంబైకి వచ్చి 11న లక్నో కు చేరుకున్నట్టు చెప్పుకొస్తుంది కనికా.
ఇప్పుడు సమస్యంతా ఆమె హాజరైన పార్టీలో ఎంపీ దుశ్వంత్ సింగ్ ఉండడమే. మొన్న పార్లమెంట్ కు కూడా అటెండ్ అయిన దుష్యంత్ సింగ్ ఆ తరువాత ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన పలువురు ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అల్పాహారం చేశారు. ఈ బ్రేక్ ఫాస్ట్ లో మాజీ కేంద్ర మంత్రి రాజవర్ధన్ రాథోడ్, మధుర బిజెపి ఎంపి హేమ మాలిని, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కుమారి సెల్జా మరియు బాక్సర్ మేరీ కోమ్ పాల్గొన్నారు.
వసుంధర రాజే మరియు ఆమె తనయుడు దుశ్వంత్ సింగ్ లు స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ఇద్దరూ విడిగా ఒక్కో గదిలో ఉంటున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రవాణా స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుశ్వంత్ సింగ్‌తో కలిసి రెండున్నర గంటలు కూర్చున్నాను కాబట్టి నిర్బంధంలోకి వెళ్తున్నట్టు ఓబ్రెయిన్ తెలిపారు.
ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్, కాంగ్రెస్ నాయకులు దీపెందర్ హుడా, జితిన్ ప్రసాదలు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు.