కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ వాయిదా వేయక తప్పలేదు. దేశంలో కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుండి లీగ్ ను ప్రారంభిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇదే విషయాన్ని అన్ని ఫ్రాంచైజ్ లకు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్-2020 మార్చి 29నుండి జరగాల్సింది.
కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా
“భారత ప్రభుత్వంతో పాటు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అలాగే ఇతర అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేయడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది” అని బోర్డు కార్యదర్శి ‘జేషా’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అయితే ఢిల్లీ, హర్యానా లతో పాటు పలు రాష్ర్టాలు ఐపీఎల్ నిర్వహించడానికి ససేమిరా అనడంతో ఈ అంశంపై చర్చించిన బీసీసీఐ ముందు జాగ్రత్త చర్యగా లీగ్ మీ వాయిదా వేసుకోక తప్పలేదు. ముందుగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహిద్దాం అనుకున్నా దానికి అంతగా అంగీకారం కుదరలేదు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ, దౌత్య మినహా అన్ని రకాల వీసాలను ఏప్రిల్ 15 వరకు నిషేధించడంతో విదేశీ ఆటగాళ్ళు లీగ్ లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఆటగాళ్ళ వీసాలు వాణిజ్య వీసా విభాగంలోకి వస్తాయి. ఏప్రిల్ 15 తరువాత కూడా ఐపీఎల్-2020 జరిగే అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయో తెలియాలంటే అప్పటికి వైరస్ వ్యాప్తి మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే కరోనా దెబ్బకు ATP టూర్ (టెన్నిస్), సెరీ A (ఇటాలియన్ ఫుట్‌బాల్) మరియు NBA (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) లతో సహా అనేక ప్రపంచ క్రీడా కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయి. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య కొనసాగుతున్న చాపెల్-హాడ్లీ సిరీస్ మరియు కరాచీలో జరుగుతున్న పిఎస్ఎల్ మ్యాచ్ లను ముందుజాగ్రత్త చర్యగా ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం లేదు.