తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 1, 2020) ఒక్కరోజే 03 కరోనా మరణాలు మరియు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు (02), యశోద ఆసుపత్రిలో ఒకరు (01) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది.
ఈ మూడు మరణాలు కలుపుకుంటే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తొమ్మిది (09) కి చేరింది. అలాగే కొత్తగా కరోనా వైరస్ సోకినా వారి సంఖ్య 127కు చేరింది.
తెలంగాణ కరోనా సమాచారం 1 ఏప్రిల్ 2020
ఈ 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిగానే తేలిందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ సీఎంఓ కార్యాలయం తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాలు వెల్లడించింది… ఇంకా “గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదు.” అని కూడా తెలిపింది.
మర్కజ్ కు వెళ్లివచ్చిన ఇంకా 300 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం అభ్యర్థించింది.