
మోటారు వాహనాల సవరణ బిల్లు – 2017, అసేలేంటి ఈ సవరణ ? ఎవరికోసం ? ఎందుకింత నిరసనలు ? కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్ట సవరణ చేయనున్న మోటార్ వెహికల్ సవరణ బిల్లు – 2017 (Motor Vehicle Amendment Bill [MV-Amendment Bill] – 2017) కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రైవేటు, ప్రభుత్వ కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి.
అసేలేంటి మోటారు వాహనాల సవరణ బిల్లు – 2017
అసేలేంటి మోటారు వాహనాల సవరణ బిల్లు – 2017
ఎందుకింత నిరసనలు
ఈ చట్టం అమలులోకి వస్తే ఎవరికీ నష్టం
కార్పోరేట్ సెక్టారుకు సహకరించేదే ఈ చట్టమా !
ఈ చట్టంలో ఏం పొందుపరచటం జరిగింది
ముందుగా ఈ మోటారు వాహనాల సవరణ బిల్లు – 2017 ను అన్ని కార్మిక సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చూద్దాం. లారీ, ఆటో, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేస్తున్నాయి, వారి ఆరోపణలు ఏంటి పరిశీలిద్దాం.
ఎందుకీనిరసనలు – ఆరోపణలు
- ఈ బిల్లు అమల్లోకి వస్తే రవాణా రంగంలో తీవ్రమైన కుదుపులు రావడం తథ్యం.
- ఉద్యోగాలకు, ఉపాధికి గండి పడడం
- చిన్న ప్రమాదాలకే డ్రైవర్లకు కఠినమైన శిక్షలు. జైలు శిక్షలు పడితే కుటుంబాల పరిస్థితి ఏంటి
- పోలీసుల వేధింపులకు గురికావలసి వస్తుంది
- రవాణా రంగంలో పనిచేస్తున్న దాదాపు 10 కోట్ల మంది జీవనోపాధి అగమ్యగోచరంగా మారుతుంది
- రూట్లను వేలం వేసే విధానంతో ప్రైవేటు వారికి లాభం చేకూర్చడం
- కొన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం
- దేశం లో ఉన్న 57 ఆర్టీసీలను నష్టాల పేరుతో నిర్వీర్యం చేయడం
- ఫిట్నెస్ పరీక్ష, లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం
- నిరుద్యోగ యువతకు ఉపాధి నిలిచే ఆటో, క్యాబ్ మొదలగు వాటి మీద ఈ బిల్లు ప్రభావం తీవ్రం
- ఓల, ఊబర్ వంటి సంస్థలకు యజమానులుగా కాకుండా మధ్యవర్తులుగా గుర్తింపునిస్తుంది
- బ్రాండెడ్ కంపెనీల విడి భాగాలు మాత్రమే వాడడం కాకుండా, అధీకృత (ఆతరైస్డ్) సర్వీసు సెంటర్లలోనే మరమత్తులు చేయించుకోవాలి
- వాహన బీమా ప్రీమియంలు భారీగా పెంచటం
- ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థకు ధీటుగా ప్రైవేటు రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం
మోటారు వాహనాల సవరణ బిల్లు – 2017 ఏంటి ?
భారతదేశంలో ప్రతీ సంవత్సరం ఒక లక్ష యాబై వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం, ప్రతీ నాలుగు నిమిషాలకు ఒక ప్రాణం, ప్రతీ రోజు నాలుగు వందల ప్రాణాలు బలిగొంటున్నాయి మన రోడ్లు.
ఇందులో ప్రతీ రోజుకు 20 మంది 14 సం.ల లోపు చిన్నారులు చనిపోతుంటే 25% మంది ద్విచక్ర వాహనదారులు చనిపోతున్నారు. 18 నుండి 45 సం.ల లోపు అంటే దాదాపుగా 68.60% మంది ప్రతీ సంవత్సంరం రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాస్తున్నారు. తాగి ప్రమాదాలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్న వారు ఐదు ప్రమాద ప్రాదాన కారకాలుగా నిలుస్తున్నాయి. అవి ….
- మితిమీరిన వేగం
- తాగి వాహనాలు నడపడం
- ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం
- హెల్మెట్/సీటు బెల్టు మొదలగు భద్రతా నియమాలు పాటించకపోవడం
- పిల్లల భద్రతా పరిమితులు పాటించకపోవడం
సం. | ప్రమాదాలు | మరణాలు |
2015 | 5,01,000 | 1,46,000 |
2016 | 4,80,000 | 1,50,000 |
2017 | 4,60,000 | 1,46,000 |
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గాయపడిన మరియు చనిపోయిన వారికి తగు హక్కులను కల్పించే ఉద్దేశ్యంతో తీసుకోవచ్చిందే మోటారు వాహనాల సవరణ బిల్లు – 2017. ఇంకా ఇందులో ఉన్న అంశాలు వివరంగా పరిశీలిద్దాం.
ఎప్పటిదీ మోటారు వాహనాల సవరణ బిల్లు
నిజానికి 1914 సం.లోనే మొదటిసారిగా మోటారు వాహనాల చట్టం వచ్చింది. దీని స్థానంలో పూర్తి స్థాయిలో మోటారు వాహనాల చట్టం – 1939 అమలులోకి వచ్చింది. పలు సవరణలు చేస్తూ 1988 సంవత్సంరం వరకు ఇదే చట్టం అమలులో ఉంది. అయితే జూలై 1, 1989 సంవత్సంరం నుండి మోటారు వాహనాల చట్టం – 1988 కొత్త మార్గదర్శకాలతో అమలులోకి వచ్చింది.
గత 30 సంవత్సరాల నుండి నాలుగు సార్లు (1994, 2000, 2001 & 2015) సవరణలు చేశారు.
- 2016 లో మళ్ళీ సవరణలు చేయదలచి మోటారు వాహనాల చట్టం – 2016 ను ప్రవేశపెట్టారు
- ఆగష్టు 9, 2016న మోటారు వాహనాల సవరణ బిల్లు – 2016 లోకసభలో ప్రవేశ పెట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం
- ఏప్రిల్ 10, 2017న లోక్ సభలో ఈ సవరణ బిల్లు ఆమోదం చెందడంతో పాటు మోటారు వాహనాల (సవరణ) బిల్లు – 2017 గా మార్చడం జరిగింది
- బిల్లును పరీక్షించే నిమిత్తం ఆగష్టు 8, 2017న 24 సభ్యుల సెలక్షన్ కమిటీ రాజ్య సభకు పంపించారు
- డిసెంబర్ 22, 2017న సెలక్షన్ కమిటీ తన రిపోర్టును రాజ్యసభ ముందు పెట్టింది
- ఒకే దేశం, ఒకే పర్మిట్, ఒకే టాక్స్ విధానం అంటూ ఈ కమిటీ సూచించింది
మోటారు వాహనాల (సవరణ) బిల్లు – 2017 ప్రతిపాదనలు
మోటారు వాహనాల ప్రమాద నిది |
జాతీయ రవాణా విధాన సూత్రీకరణ |
రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపే నగదు రహిత వైద్య చికిత్స అందేలా ప్రత్యేక స్కీం ఏర్పాటు |
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు మరియు ఆ పైన పరిహారం అందించడం (ప్రస్తుతం రూ.25,000/-) |
ప్రమాదం జరిగినప్పుడు సహాయం అందించే వారికి రక్షణ మొదలగు అంశాలు |
తాగి వాహనం నడిపిన వారికి జరిమానా రూ.10,000/- వరకు (క్రితం రూ.2,000/-) |
నిర్లక్షంగా వాహనం నడిపితే జరిమానా రూ.5,000/- వరకు (క్రితం రూ.1,000/-) |
లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసే వారికి జరిమానా కనిష్టంగా రూ.5,000/- వరకు (క్రితం రూ.500/-) |
మితిమీరిన వేగం జరిమానా రూ.1,000 – 2,000/- |
హెల్మెట్/సీటు బెల్ట్ ధరించని వారికి జరిమానా రూ.1,000/- వరకు |
వాహనం నడుపుతూ ఫోన్ లో మాట్లాడితే జరిమానా రూ.5,000/- వరకు (క్రితం రూ.1,000/-) |
అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000/- |
మైనర్ డ్రైవర్లు ప్రమాదాలకు కారకులైతే తల్లితండ్రులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష |
డ్రైవింగ్ లైసెన్సు జారీ ప్రక్రియ కఠినతరం – కొత్త మార్గదర్శకాల జారీ |
30 నుండి 50 సంవత్సరాలలోపు వారు తీసుకునే డ్రైవింగ్ లైసెన్సు 10 సంవత్సరముల వరకే చెల్లుబాటు |
50 నుండి 55 సంవత్సరాలలోపు వారు తీసుకునే డ్రైవింగ్ లైసెన్సు ఆ అభ్యర్థి 60 సం.ల వరకే చెల్లుబాటు |
55 సం. పైబడిన అభ్యర్థులు తీసుకునే లైసెన్సు 5 సం.ల వరకే చెల్లుబాటు |
డ్రైవింగ్ లైసెన్సు పునరుద్ధరణ (రెన్యువల్) గడువు ఒక నెల నుండి సంవత్సరం పొడిగింపు |
వికలాంగుల సౌకర్యార్థం తప్పనిసరిగా వాహనాలకు తగు మార్పులు చేసుకోవాలి |
దేశవ్యాప్త నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తారా లేక బిల్లులో కొన్ని మార్పులు చేసి ఆమోదింపచేసుకుంటుందా వేచి చూడాలి.
తప్పులు ఉంటే మరియు మరింత సమాచారం మీకు తెలిసింది కింది కామెంట్ బాక్సు ద్వారా తెలియజేయగలరు.