భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్‌ జరుగుతుండగా క్రేన్ పైన నిర్మించిన ఓవర్ హెడ్ జెయింట్ లైట్ ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా 10 మంది వరకు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ శంకర్ కు కూడా కొంచెం తీవ్రంగానే గాయాలయినట్టు తమిళ వార్తా సంస్థలు వెలువడిస్తున్నాయి. కమల్ హాసన్ కు స్వల్ప గాయాలు అవగా షూటింగ్ స్పాట్ లోనే ప్రథమ చికిత్స చేశారు.

భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం

కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ గత కొన్ని రోజులుగా చెన్నై సమీపంలోని పూనమల్లె వద్ద ఉన్న ఈవీపి
థీమ్ పార్కులో జరుగుతుంది. అనుకోకుండా ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ
ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ (34), శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (28) మరియు ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60) లు ప్రాణాలు కోల్పోయారు.

150 అడుగుల భారీ క్రేన్ కావడంతో ప్రమాద భారిన పడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తృటిలో పెను ప్రమాదం నుండి
బయటపడ్డ దర్శకుడు శంకర్ కు తగిలిన గాయాల సమాచారం ఇంకా తెలియరాలేదు. కొందరు జర్నలిస్టులు ట్విట్టర్ లో తెలిపిన వాటి ప్రకారం కాలుకు బలమైన గాయాలు అయినట్టు తెలుస్తుంది. నజరత్ పేట పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్, రకుల్ హీరోయిన్లుగా నటిస్తుండగా సిద్ధార్థ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Read Also: జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో